ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సుజాత పోస్టుగ్రాడ్యూయేట్ చేశారు. పెద్ద చదువులు చదివినా...వ్యవసాయంపై మక్కువతో పొలం బాటపట్టారు. మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడానికి కారణాలు, అప్పటి సహజ సిద్ధ సాగు విధానాలను సుజాత తెలుసుకున్నారు. రసాయనాలు వినియోగించని కూరగాయాలు, పండ్లు కోసం ఎంతగానో ప్రయత్నించేవారు. అవి అరకొరగానే దొరికేవి. అందువల్ల తామే తమ అవసరాలు కోసం ప్రకృతి వ్యవసాయం చేయాలని భావించారు. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని తెలుసుకున్నారు. 2014లో కనిగిరి సమీపంలో పెదారగట్ల గ్రామంలో 50 ఎకరాల పొలాన్ని తీసుకున్నారు. ఈ భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు ప్రారంభించారు. ఔషధ మొక్కలు, చిరు ధాన్యాలు సాగు చేయడం ప్రారంభించారు. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు స్వయంగా తయారుచేసేవారు. వర్షాలు తక్కువుగా ఉండడం వల్ల తొలి సంవత్సరం కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా...నేల సారం పెరుగుతుండటంతో ఫలితాలు రావడం ప్రారంభమైంది.
ప్రకృతి వ్యవసాయమంటే రసాయనాలు వినియోగించకుండా ఆవు మూత్రం, పేడలను వినియోగించి సాగు చేయడమొక్కటే కాదు... సాగులో కొన్ని పద్ధతులు పాటించాలి. గ్రీన్ మెన్యూర్, పంట మార్పిడి, గడ్డితో మల్చింగ్, ఒకే క్షేత్రంలో విభిన్న రకాల పంటలతో అంతర పంటలు విధానం, చీడపీడల నివారణ కోసం పెస్ట్ మేనేజ్‌మెంట్, ఔషధ మొక్కల పెంపకం, ఆవులు పెంపకం ఇలా.... భిన్న పద్దతులుతో సాగు చేస్తేనే ఫలితాలు వస్తాయని భావించి, ఈ పద్ధతులన్నీ ఈ క్షేత్రంలో అమలు చేస్తున్నామంటున్నారు రైతు సుజాత.
కంది, మినుము, పెసరు, బొబ్బర్లు, శనగ, వేరుశనగ, నువ్వులు, అరెకెలు, సామలు, అండుకొర్రలు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, పసుపు, మిర్చి, మొక్కజొన్నలుతో పాటు ఉద్యాన పంటలు మామిడి, సపోటా, సీతాఫలం, జామ, దానిమ్మ, ఉసిరి, నిమ్మ, నేరేడు, కొబ్బరి, మునగ వంటి 30 రకాల పంటలు సాగుచేస్తున్నారు. అన్ని రకాల కూరగాయలు కూడా పండిసున్నారు. స్వల్పకాలిక పంటలు ఒకసారి వేసిన తరువాత అదే స్థలంలో అదే పంట వేయమని, పంట మార్పడి ద్వారా చీడపీడలు ఆశించవని ఆమె పేర్కొంటున్నారు. వీరు పండించిన ఉత్పత్తులను చాలా వరకు విలువ ఆధారిత పద్ధతిలో ఉత్పత్తులు తీసుకువస్తారు. నువ్వులు, వేరుశనగ నూనె తయారు చేయడం, పసుపు, కారం కూడా సొంతంగా పొడులు ఆడించడం, కొర్రలు, అండ్రుకొర్రలు, సామలు, జొన్నలు వంటివి శుద్ధిచేసి సొంతంగా ఎగుమతి చేస్తున్నారు.