Ongole town cremation ground issue: ఒంగోలు పట్టణంలో జనావాసాల మధ్య ఉన్న శ్మశానవాటిక అభివృద్ది విషయంలో పాలక వర్గం నిర్లక్ష్యం చూపిస్తోంది. ఆధునిక సౌకర్యాల కల్పనలో అసంపూర్తి పనుల కారణంగా లక్షలాది రూపాయల నిధులు వృథా అయ్యాయని విమర్శలు తలెత్తుతున్నాయి. చుట్టూ జనావాసాలు, ఆసుపత్రులు ఉండటం వల్ల దహన సంస్కరణల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. దహన సంస్కరణ కోసం గ్యాస్ ఆధారిత యంత్రాలు ఏర్పాటు చేసినా, వాటిని వినియోగంలోకి తీసుకురావడం లేదని విమర్శిస్తున్నారు.
ఒంగోలు పట్టణ నడిబొడ్డులో ఆర్టీసి బస్టాండ్‌కు ఆనుకొని, జనావాసాల మధ్యనున్న మహాప్రస్థానం నిర్లక్ష్యానికి గురవుతోంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శ్మశాన వాటిక నిర్వహణ విషయంలో పాలక వర్గం దృష్టి సారించడం లేదు. దాదాపు 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ మహాప్రస్థానం.. గతంలో ఒంగోలు పట్టణ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పరిచారు. చెట్లు, తుప్పలతో, ఆక్రమణలకు గురయిన ఈ మహాప్రస్థానం అభివృద్ధి సమితి పుణ్యమా అని కొన్ని సౌకర్యాలు కల్పించినా, నిర్వహణ విషయంలో ఈ సమితికి, నగర పాలక సంస్థకు సమన్వయం లేక కొన్నాళ్లు మళ్లీ నిర్వహణకు నోచుకోలేదు.