ప్రకాశం జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురిచేడుకు చెందిన వెంకయ్య ఈనెల 19న జ్వరం లక్షణాలతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. ఆస్పత్రి సిబ్బంది అతనికి కరోనా పరీక్షల నమూనాలు సేకరించి జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్కాపురంలోని కొవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ కూడా జ్వరం అదుపులోకి రాకపోవడం వల్ల ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. బాధితుడు అక్కడ చికిత్స పొందుతూ.. ఈనెల 21న మృతి చెందాడు. అయితే ఈ విషయం ఆస్పత్రి సిబ్బంది బంధువులకు తెలపలేదు.
వెంకయ్య బంధువులు అతని యోగక్షేమాలు తెలుసుకొనుటకు రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి విచారించగా.. అక్కడి సిబ్బంది మూడ్రోజుల క్రితమే బాధితుడు చనిపోయినట్లు చెప్పారు. విషయం విన్న బంధువులు నిర్ఘాంతపోయారు. వెంకయ్య మృతి చెందిన విషయాన్ని తమకు తెలియజేయడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.