ఒంగోలు డెయిరీ మూత పడటంతో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. వారిని ఇటీవల ప్రభుత్వం స్వచ్చంద పదవీవిరమణతో తొలగించడమే కాక..ఇప్పటివరకు వారికి బకాయిలు చెల్లించలేదు.
ఇంటికైతే పంపించారు..బకాయిల మాటేంటి?
ప్రకాశం పాడిఉత్పత్తి దారుల సమైఖ్య పేరుతో నడుస్తున్న ఒంగోలు డెయిరీ.. రాష్ట్రంలోనే మంచి పేరు గడించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పాల డెయిరీని నాలుగు నెలల క్రితం గుజరాత్ అమూల్‌కు అప్పగించింది. పాల సేకరణ కూడా... పాడి సమైక్యల నుంచి కాకుండా రైతుభరోసా కేంద్రాల ద్వారా చేస్తున్నారు. ఇందులో పనిచేసే ఉద్యోగులకు మంచి ప్యాకేజీ ఇచ్చి..స్వచ్ఛంద పదవీ విమరణతో ఇంటికి పంపిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. ఉద్యోగులు చేసేదిలేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఒక నెల ముందుగానే వీరిని ఉద్యోగ విధుల నుంచి తొలగించి..ఇంటికి పంపారు. ఇదంతా బాగానే ఉన్నా యాజమాన్యం చెప్పిన విధంగా వారికి చెల్లించాల్సిన బకాయిలు, జీతాలు, ప్యాకేజీలో చెప్పినట్లు పరిహారం..ఇంతవరకూ ఇవ్వలేదని ఉద్యోగులు వాపోతున్నారు.
ఆరోగ్యాలు బాగాలేవు..!
ఒంగోలు డైయిరీలో జిల్లా వ్యాప్తంగా 67 మంది రెగ్యూలర్ ఉద్యోగులు పనిచేసేవారు. వీరంతా కాకుండా మరో 56 మంది క్యాజువల్ సిబ్బంది ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించగా, క్యాజువల్ సిబ్బందిని ఉన్నపళంగా ఎలాంటి పరిహారం చెల్లించకుండానే పంపించేశారు. వీరితో పాటు గతకొన్నేళ్లలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు 56 మంది వరకూ ఉన్నారు. ఈ పదవీ విరమణ చేసిన వారికి కూడా..ఇంతవరకూ ఎటువంటి గ్రాట్యుటీ చెల్లించలేదు. ఈ గ్రాట్యుటినే దాదాపు 3 కోట్ల రూపాయలు ఉంటుందని... వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులు చెబుతున్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికే చనిపోయారని, మరికొంత మంది ఆరోగ్యం బాగోలేక, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతన్నారని చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు గ్రాట్యుటి, ఎల్ఐసీ డబ్బులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారని అయినా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.
మమ్మల్ని పట్టించుకున్నవారే లేరు..!
గుజరాత్ కంపెనీ అమూల్‌కు.. ఒంగోలు డెయిరీని కట్టబెట్టి తమ ఉద్యోగులు తీసేశారని, కనీసం తమకు చెల్లించాల్సిన బకాయిలైనా త్వరతిగతిన ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:ఎస్ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: పవన్