ఒంగోలు పట్టణానికి చెందిన అదిల్ షేక్... బీటెక్ విద్యార్థి. తొలినుంచి రోబోటిక్స్ మీద ఉన్న ఆసక్తితో అనేక పరిశోధనలు చేశాడు.. చేస్తున్నాడు. నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. అక్కడితో ఆగకుండా... బీటెక్ రెండో సంవత్సరం చదువుతూనే... రోబోటిక్స్ మీద నేటి తరానికి అవగాహన కల్పిస్తున్నాడు. అదిల్ ఇన్నోవేషన్ క్లబ్ పేరుతో ఒంగోలు పట్టణంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు తరగతుల నిర్వహిస్తున్నాడు.
అదిరేలా అదిల్... రోబోటిక్స్ శిక్షణ! - రోబోటిక్స్
ఒక వైపు చదువు.. మరోవైపు.. తనకిష్టమైన రంగంలో పరిశోధన... ఆ అంశాలపై పిల్లలకు అవగాహన.. ఇదే చేస్తున్నాడు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన అదిల్ షేక్. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా.. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తే.. మున్ముందు ఆవిష్కర్తలుగా మారుతారనేదే ఆ యువకుడి ఆలోచన. ఈ కారణంతోనే... విద్యార్థులకు రోబోటిక్స్‌లో డ్రోన్ టెక్నాలజీ, ఏరోనాటికల్, త్రిడీ ప్రింటింగ్ టెక్నాలజీ తదితర సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నాడు.
కొంతమంది సహాయకులను ఏర్పాటు చేసుకున్న అదిల్ షేక్... రోబోటిక్స్‌తో ప్రయోజనం, తయారీ, కోడింగ్, అనుబంధంగా ఉన్న సాంకేతిక అంశాలు ఏమిటనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నారు. డ్రోన్ టెక్నాలసీ, ఏరో డైనమిక్ , త్రిడి ప్రింటింగ్ టెక్నాలజీ వంటివి నేర్పిస్తున్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులనుంచి, పదో తరగతి విద్యార్థుల వరకూ శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రానికి భారత ప్రభుత్వ అనుమతి పొందటమే కాకుండా సౌత్ కొరియాకు చెందిన రోబో రోబు అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇలాంటి శిక్షణ వల్ల తమ పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని తల్లిదండ్రలు ఆశిస్తున్నారు. చదువుకుంటునే ఖాళీ సమయంలో శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తూ, సాంకేతికంగా విద్యార్థులకు ఙ్ఞానాన్ని అందిస్తూ... తన కాళ్లపై తానే నిలబడుతూ.. పలువురికి స్ఫూర్తి ఇస్తున్నాడీ యువకుడు.