ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తోకపల్లి గ్రామానికి చెందిన నరసింహారావు మరో ఇద్దరితో కలిసి పొలంలో మిరపకాయల లోడు ఎత్తి రహదారి పక్కన నిలుచుని ఉన్నారు. ఆ సమయంలో.. అటుగా వేగంగా వెళ్తున్న లారీ వాళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అక్కడున్న స్థానికులు వారిని వెంటనే మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్గా పనిచేస్తున్నారు.