పూర్వ విద్యార్థుల సమ్మేళనంలా పూర్వ క్రీడాకారుల సమ్మేళనం..
కబడ్డీ క్రీడకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా.. ఎంతోమంది ఆటగాళ్లు ఇక్కడి నుంచి తమ క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. ఆ ఆటతోనే చాలా మంది తమ జీవితాలను చక్కబెట్టుకున్నారు. మరెంతో మంది యువతకు మార్గం చూపారు. ఉద్యోగాలు, వ్యాపారులు, వివాహాలతో జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల లో నివసిస్తున్నారు. పత్రికలలో వచ్చే పూర్వ విద్యార్థుల సమ్మేళనంలా పూర్వ క్రీడాకారుల సమ్మేళనం ఎందుకు నిర్వహించుకోకూడదని ఒంగోలులో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పూర్ణచంద్రరావుకు వచ్చిన ఆలోచనను ఒంగోలు పేర్నమిట్టకు చెందిన, ప్రస్తుతం హైదరాబాద్‌లో డీఎస్పీగా ఉన్న వేణుగోపాల్‌తో పంచుకున్నారు.
అలా పురుడుపోసుకున్న ఆలోచన కార్యరూపం దాల్చింది. వాట్సాప్ గ్రూపును సృష్టించి ప్రకాశం జిల్లాకు చెందిన పూర్వ కబడ్డీ క్రీడాకారులకు ఆహ్వానం పలికారు. అలా 1970-2020 మధ్య కాలంలో ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కబడ్డీ ఆటను ప్రారంభించి..రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడివారు.. వివిధ విభాగాల్లో ఉద్యోగంలో స్థిరపడిన వారు.. ఉన్నత పదవులు అలంకరించిన వారు.. వ్యాపారంలో స్థిరపడి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వారు. గృహిణులుగా ఉన్నవారు... ఉద్యోగ విరమణ చేసిన వారు మొత్తం 270 మందిని గుర్తించారు. వారందరూ ఒక చోటుకు చేరడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. " గోల్డెన్ జూబ్లీ ప్రకాశం జిల్లా కబడ్డీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం" పేరుతో ఒంగోలు లోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో అంతా సమావేశం అయ్యారు.
ఆత్మీయ పలకరింపులు.. ఆలింగనాలు.. కుశల ప్రశ్నలు..నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడంతో ఆ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.. ఒకరినొకరు పలకరించుకుంటూ.. పొగడుకుంటూ.. జీవితంలో స్థిరపడటానికి కబడ్డీ ఏవిధంగా ఉపయోగపడిందో వివరించుకుంటూ నాటి అనుభూతిని పొందారు.