GUNDLAKAMMA PROJECT : కరవు జిల్లా అయిన ప్రకాశంలో వేలాది ఎకరాలకు సాగు, తాగు నీరు అందించే ప్రధాన ప్రాజెక్టు.. గుండ్లకమ్మ రిజర్వాయర్. ఈ ఏడాది గుండ్లకమ్మ జలాశయం నిండింది. ఇక సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని జిల్లా రైతులు సంబరపడే లోపే..గేట్ల సమస్య వారి ఆశలకు గండి కొట్టింది. బుధవారం రాత్రి ప్రాజెక్టు మూడో గేటు దెబ్బతిని టీఎంసీకి పైగా నీరు సముద్రం పాలైంది. మరోవైపు గేట్ మరమ్మతు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. జలాశయంలో నీళ్లు నిండుగా ఉండటంతో.. స్టాప్ లాక్ వేయడానికి వీలు పడలేదు. నీటి నిల్వలు తగ్గితేనే మరమ్మతులకు అవకాశం ఉందని ఇంజినీర్లు చెప్పడంతో.. 13, 14, 15 నెంబర్ల గేట్లు కూడా ఎత్తి నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.
3.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో బుధవారం నాటికి దాదాపు పూర్తి స్థాయి నీటినిల్వలు ఉన్నాయి. 6, 7 గేట్ల నుంచి స్వల్ప లీకేజీలుండగా.. గతంలోనే మరమ్మతులకు టెండర్లు పిలిచారు. ఇంతలోనే మూడో నెంబర్ గేట్ దెబ్బతింది. నిండుగా ఉన్న జలాశయం నుంచి ఇలా నీటిని వృథాగా వదిలేయడంపై రైతు సంఘం నేతలు, అన్నదాతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. విలువైన మత్స్య సంపద సంద్రం పాలవుతుందని స్థానిక జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.