నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పెద్దసంఖ్యలో వాహనాలు కొనుగోలు చేసింది. 2018-19లో రాయితీలపై ఆటోలు, ట్రాక్టర్లు, డ్రైక్లీనింగ్ యంత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 135 పంచాయతీలకు 60 శాతం రాయితీపై ఆటోలు కొనుగోలు చేశారు. ఒక ఆటో ఖరీదు 2 లక్షల 6 వేల రూపాయలు కాగా.. రాయితీ లక్ష 23 వేల రూపాయలు ఇచ్చారు. 82 వేల రుణం మంజూరు చేశారు. ఇలా 135 ఆటోలు కొనుగోలు చేశారు. అదే విధంగా కాలువల్లో పూడికతీత కోసం ట్రాక్టర్లు, మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు డ్రైక్లీనింగ్ యంత్రాలూ కొనుగోలు చేశారు. ఒక్కో యూనిట్ ఖరీదు 15 లక్షల 20 వేల రూపాయలు.. వాటినీ రాయితీ మీద అందించేందుకు ప్రణాళిక రచించారు. 18 మండలాలకు పంపిణీ చేయగా, మరో 38 మండలాల్లో సరఫరా నిలిపేశారు. దీంతో ఆ వాహనాలన్నీ జిల్లా ప్రగతి భవనం దగ్గర, ఆయా మండలాల్లోని అభివృద్ధి కార్యాలయాల వద్ద పడిఉన్నాయి.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో అప్పట్లో పంపిణీ నిలిచిపోయింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తమకు అందిస్తారనే ఆశతో ఉన్న లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. ఇన్నాళ్లూ పంపిణీ చేయకపోవటానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయని.. కొన్ని విడిభాగాలను దొంగలు దోచుకుపోతున్నారని పలువురు లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు పంపిణీ చేసినా అవి ఎందుకూ ఉపయోగపడని విధంగా తయారయ్యాయని చెబుతున్నారు.