ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సామర్థ్యాలు, విశ్లేషణా శక్తి పెంచే రీతిలో ప్రవాసాంధ్రులు చేపట్టిన 'పుస్తకాలతో స్నేహం' అనే కార్యక్రమం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సర్కారీ బడుల్లో విద్యార్థులకు వివిధ రకాల సాహిత్యంతో కూడిన పుస్తకాలు ఉచితంగా అందిస్తూ.. భవిష్యత్తులో వారు ప్రయోజకులుగా ఎదిగేలా తమవంతు కృషి చేస్తున్నారు. వివిధ దేశాలు, వృత్తుల్లో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 250 మంది.. ప్రకాశం గ్లోబల్ ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ అనే సంస్థగా ఏర్పడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డాక్టర్ కొర్రపాటి సుధాకర్, సాహితీవేత్త సీ.ఎ.ప్రసాద్ ప్రవాసాంధ్రుల తరఫున ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
మూడేళ్లలో 160 పాఠశాలల్లో కార్యక్రమాలు..
పుస్తకాలు అందజేసిన తర్వాత వాటిని పిల్లలకు అలవాటు చేసేలా 2 రోజుల పాటు వర్క్ షాపు నిర్వహించి.. పిల్లలతో కథలు చదవించడం, వాటిని నాటకాలుగా ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. ప్రకాశం జిల్లాలో మూడేళ్ల నుంచి సుమారు 160 పాఠశాలల్లో 'పుస్తకాలతో స్నేహం' కార‌్యక్రమంలో భాగంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. చరిత్ర, సైన్స్, సాహిత్యం లాంటి వివిధ అంశాలతో కూడిన పుస్తకాలు అందజేస్తూ వస్తున్నారు.