చెరకు పండించలేక.. చేతులెత్తేస్తున్న రైతులు - high investment
ప్రకాశం జిల్లాలో బెల్లం రైతుల జీవితాలు చేదుమయమయ్యాయి. వర్షాభావ పరిస్థితుల్లో సరైన దిగుబడి రాక ఇబ్బంది పడుతున్న కర్షకులను.... గిట్టుబాటు ధర మరింత కుంగదీస్తోంది. ఎటు నుంచీ సాయం అందని మట్టి మనిషి.... బెల్లం తయారీనే వదిలేయాలని నిర్ణయానికి వచ్చాడు. చెరకు పంట వేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బెల్లం తయారీకి ప్రసిద్ధి. రామభద్రాపురం, నాగంబొట్లవారిపాలెం, లక్కవరం, ముండ్లమూరు మండలంలోని సింగన్నపాలెంలోని రైతులు చెరకు పండించి బెల్లం తయారీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు రైతులు అతి కష్టం మీద చెరకు పండించి బెల్లం తయారీ చేస్తున్నారు. పరిస్థితి ఇంకా చేయిదాటిపోయింది. అందుకే ఈసారి తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. కనీసం గిట్టుబాటు ధర లేక దిగాలు పడిపోతున్నారు.
పెట్టుబడి బరువై... లాభాలు కరవై
ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి కూలీలను తీసుకొచ్చి బెల్లంతయారీ చేసి... విక్రయిస్తుంటారు ఇక్కడి రైతులు. ఒక్కో ఎకరానికి సుమారు 50 వేల నుంచి 70 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడికి సరిపడా లాభాలు రాక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.