No Food for IIIT Students : ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 5న భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటించారు. వండిన అన్నం అయిపోయిందని చెప్పడంతో ఆకలికి తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి, భోజనం పంపించమని అడిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. "నాతోపాటు మరో ఇద్దరు స్నేహితులకు అన్నం, నీళ్ల సీసాలు పంపించే ఏర్పాటు చేయగలరా" అని ఓ విద్యార్థిని ఫోన్ చేసి అడిగిందంటే తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు! అయినా జగన్ ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు. జగన్ సీఎం అయిన తర్వాత తనకు బంధువయ్యే వ్యక్తిని తీసుకొచ్చి కీలక పదవిలో కూర్చోబెట్టారు. ఇక్కడ ఆయన చెప్పిందే వేదం. దీనిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు హడలెత్తిపోతారు. గత కొంతకాలంగా ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో భోజనం, ఇతర సౌకర్యాలపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోంది.
IIIT Students Worst Situation in YSRCP Ruling : ఒంగోలు ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం 2017లో పామూరు మండలం దూబగుంట వద్ద శంకుస్థాపన చేయగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ స్థలాన్ని కనిగిరి మండలం బల్లపల్లికి మార్చేసింది. అంచనా వ్యయం 1,200కోట్ల రూపాయలు కాగా ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. PUC 1, 2 విద్యార్థులకు ఇడుపులపాయలో చదువు చెబుతున్నారు. మిగతా 4000 మందిని స్థానికంగా అద్దెకు తీసుకున్న భవనాల్లో ఉంచుతున్నారు. ఇడుపులపాయలో 8వేల మంది ఒకేచోట ఉండాల్సి వస్తోంది. కొందరు విద్యార్థినులను గతేడాది మార్చిలో ఇడుపులపాయలోని పాత క్యాంపస్‌లోకి మార్చడానికి ప్రయత్నించగా, అక్కడికి వెళ్లబోమని రెండు రోజుల పాటు ధర్నా చేశారు. పాత క్యాంపస్‌లో పాములు, తేళ్లు, విష కీటకాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రేకుల షెడ్లలోనూ తరగతులు : శ్రీకాకుళంలో 66 కోట్ల 70 లక్షలతో 2020లో అకడమిక్ బ్లాక్ నిర్మాణం మొదలుపెట్టారు. అది ఇంతవరకు పూర్తి కాలేదు. విద్యార్థులకు సరిపడా భవనాలు లేక ఈ క్యాంపస్‌కు చెందిన 2వేల మందిని నూజివీడులో ఉంచుతున్నారు. రెండు క్యాంపస్‌లకు చెందిన 8వేల మంది ఒకేచోట ఉండడంతో నూజివీడులోనూ తరగతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాత్కాలిక రేకుల షెడ్లలోనూ తరగతులు నిర్వహిస్తున్నారు.
IIIT Students Facing Problems in AP :నాలుగున్నరేళ్లుగా ట్రిపుల్ ఐటీ వర్సిటీ RGKUTకి ఉపకులపతినే నియమించలేదు. గతంలో దాదాపు రెండున్నరేళ్లపాటు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిని ఇన్‌ఛార్జి VCగా కొనసాగించారు. ఇప్పుడు JNTU అనంతపురం ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌ను ఇన్‌ఛార్జి VCగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఏకంగా ప్రైవేటు కళాశాలలకు చెందిన వారిని తీసుకొచ్చి శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లుగా నియమించారు.