ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ మహాపాదయాత్రను కొనసాగిస్తామని రాజధాని మహిళా రైతులు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చిన తమను ప్రస్తుత ప్రభుత్వం అన్యాయం చేసిందని వాపోయారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామికి మొర పెట్టుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న కొంతమంది మహిళలకు కాళ్లు వాయగా, మరికొందరికి బొబ్బలెక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా రైతులు, మహిళలు ఇస్తున్న మద్దతు, సహకారంతో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిదో రోజులో భాగంగా ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు 10.5 కి.మీ పాదయాత్రను సాగించనున్నారు.
రైతులకు మద్దతుగా మహిళా జేఏసీ నేతల పూజలు..
"న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ" పేరుతో అమరావతి పరిరక్షణ సమితి, రైతులు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని కోరుతూ... మహిళా జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న కార్తికమాసం తొలి సోమవారం కావడంతో శివయ్యకు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంద్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రభుత్వం ప్రకటించేలా ముఖ్యమంత్రి జగన్కు పరమేశ్వరుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్లు మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ తెలిపారు.