ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం జమ్మిచెట్టు వీధిలో వెన్నలకంటి రామచంద్రరావు అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయన పూర్వీకులు అక్కడే పెంకుటిల్లులో జీవించేవారు. వారి పెరట్లో వేప చెట్టు ఉండేది. రామచంద్రరావు ఇంజినీరుగా పని చేస్తున్నారు. పాత పెంకుటిల్లు స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టాలని అనుకున్నారు. కొలతలు తీసుకున్నారు. ఇంటి నిర్మాణానికి అడ్డుగా వేప చెట్టు ఉంది. దాన్ని తొలగిస్తే తప్ప నిర్మాణానికి వీలు కాదు. ఇక ఆ వృక్షాన్ని తొలగించాల్సిందేనని అంతా భావించారు. కానీ తాతల కాలంనుంచి ఉన్న చెట్టును నరికేయాలంటే రామచంద్రరావుకు మనసు ఒప్పలేదు.
వేప చెట్టును అమ్మవారిలా..
వేప చెట్టును అమ్మవారిలా రామచంద్రరావు భావించారు. అడ్డుగా పెరిగిన కొమ్మలు మాత్రమే తొలగించి.. దానికి అనుగుణంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. నిర్మాణం మధ్యలో చెట్టు ఉండిపోయింది. తనకున్న ఇంజినీరింగ్ పరిఙ్ఞానంతో ఎక్కడా ఎలాంటి పగుళ్లు, లీకేజీలు లేకుండా స్లాబ్‌లు నిర్మాణం చేపట్టారు. మూడంతస్థుల మేడ కట్టినా.. చెట్టు ప్రాణాలతో ఉంది. కాండం, వేళ్లు ఇంటి మధ్యలో ఉన్నాయి. చెట్టు ఇంకా పచ్చగా.. యథావిధంగా బతికేస్తోంది. ఇంట్లో భాగమైపోయింది.
ఇబ్బందులేమీ లేవు..
రామచంద్రరావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. తన ఇంటిని అద్దెకిచ్చారు. అందులో ఉన్నవారు సైతం వేప చెట్టును అమ్మవారిగా భావించి పూజలు చేస్తున్నారు. చెట్టువల్ల ఇబ్బందులేమీ తలెత్తలేదని తెలిపారు. వేసవిలో ఇంటిలోపల చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటోందని పేర్కొన్నారు. చెట్టును దైవ సమానంగా భావించి పరిరక్షిస్తుండటం..దాన్ని కాపాడుతూ ఇంటినిర్మాణం చేపట్టడం అందరినీ ఆలోచింపజేస్తోంది.