Police Custody to Naveen Reddy: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మొదట ఎనిమిది రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. వాదోపవాదనలు విన్న ఇబ్రహీంపట్నం కోర్టు.. ఒక్క రోజు కస్టడీకి అనుమతి ఇస్తూ.. ఆర్డర్స్ జారీ చేసింది. అయితే ఒక్క రోజు కస్టడీ సరిపోదంటూ పోలీసులు జిల్లా కోర్టుకు వెళ్లగా.. ఈ రోజు విచారించిన కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో నవీన్‌రెడ్డిని రేపు ఉదయం నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు పోలీసులు విచారించనున్నారు.
ఇదీ జరిగింది: అమెరికా పెళ్లి సంబంధం రావడంతో హైదరాబాద్ మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలికి ఈ నెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పని చేసే 36 మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు.