నాడు-నేడు కార్యక్రమం వైకాపా నేతల అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. "ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెం ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబు కూలి విద్యార్థి విష్ణు మృతి చెందడం బాధాకరం. పాఠశాలల్ని దేవాలయాలుగా మార్చేస్తాం, నాడు-నేడు అంటూ పబ్లిసిటీ స్టంట్ చేశారు. స్కూల్ బ్యాగ్‌ల దందా నుంచి చీప్ క్వాలిటీ వర్క్స్ వరకూ జరుగుతున్న దోపిడీని చూసి అవినీతే సిగ్గుతో తలదించుకుంటోంది. జగన్ రెడ్డి ఎప్పుడు సిగ్గుతో తలదించుకుంటారు" అని ట్విట్టర్లో నిలదీశారు.
పైకప్పు కూలి విద్యార్థి మృతి.. ఏం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల భవనం శ్లాబ్ కూలిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విష్ణు.. ఆదివారం కావడంతో గ్రామంలోని స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదం జరిగింది. విష్ణు మృతితో వారి కుటుంబసభ్యులు తీవ్ర వేదనలో మునిగిపోయారు. కడుపుకోత తీర్చేదెవరంటూ రోదించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనానికి మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని.. నిర్లక్ష్యం వల్లే ఇవాళ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు అంటున్నారు.