ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని నల్ల కాలువను నారా లోకేశ్ పరిశీలించారు. కాలువలో తూటుకాడ పెరిగిపోవటం వల్ల వరదకు ఆటంకం ఏర్పడి పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ కారంచేడులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. లోకేశ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడంలేదని, తుపానుకు రైతులు తీవ్రంగా నష్టపోతే కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 30వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కారంచేడు మండలం తెమిడితపాడు వద్ద లక్ష్మీనాయమ్మకుంటలోని మిరప పొలాలను లోకేశ్ పరిశీలించారు. మిర్చి పంట పూర్తిగా పాడయ్యిందని, ఎవరూ తమను ఆదుకోలేదని రైతులు లోకేశ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అధైర్యపడొద్దని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. దగ్గుపాడులో పొలాల్లోకి దిగి పంటలను పరిశీలించారు.
పంటల బీమా నిధులను ప్రభుత్వం మెడలు వంచి సాధించిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలదే అని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న లోకేశ్... రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం... వారిని నిండా ముంచిందని ధ్వజమెత్తారు. రైతులు పంట నష్టపోయి తీవ్ర ఆందోళన చెందుతుంటే... అధికార యంత్రాంగం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వరదల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులను, ప్రజలను ఆదుకున్న తీరును గుర్తుచేశారు.