Nara Lokesh Face to Face With Granite Sector Representatives: దోపిడీదారులు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని.. దోపిడీదారు జగన్ పాలనలో అన్ని రంగాల ప్రజలు బాధితులే అని.. మైనింగ్ రంగంపై ఆధారపడిన వారు కూడా జగన్ బాధితులే అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రానైట్ రంగం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో పలు సమస్యలను లోకేశ్‌కు వివరించారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో 4 రూపాయలు ఉన్న యూనిట్ విద్యుత్ ధర.. వైఎస్ జగన్ పాలనలో రూ.7కు పెరిగిపోయిందని వాపోయారు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి తమను మోసం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 లక్షల మందికి ఉపాధిగా ఉన్న చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమను జగన్ నాశనం చేశారని లోకేశ్‌కు తెలిపారు. ముఖ్యమంత్రి పాలనలో 800 ఫ్యాక్టరీల్లో సగం మూతపడ్డాయని, గ్రానైట్ ఎక్స్పోర్ట్ చెయ్యడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు అదానీకి ఇచ్చి ఇతర కంపెనీల కంటైనర్లు రాకుండా చెయ్యడం వలన ఎక్స్‌పోర్ట్‌పై ఒక్కో కంపెనీకి 60 వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందని లోకేశ్‌తో వాపోయారు. మైనింగ్ యాజమానులపై విపరీతమైన జరిమానాలు వేసి వేధిస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ గ్రానైట్ రవాణా రంగాన్ని దెబ్బతీశారని ఆవేదన చెందారు. రాయల్టీ తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు 100శాతం పెంచి తమ పొట్ట కొట్టారన్నారు.