ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదాయంతోపాటు విజ్ఞానం పంచుతున్న అన్నదాత

సాగు చేస్తే వచ్చే దిగుబడి తో రైతు ఆదాయం పొందుతాడు. కానీ ఈ రైతు ఆదాయంతోపాటు, భావితరాలకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తున్నాడు. తద్వారా 2 రకాల ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువ చూపించే ఆ రైతు తన వ్యవసాయ క్షేత్రాన్ని ఓ ప్రయోగ క్షేత్రంగా తయారు చేస్తున్నాడు. తక్కువ విస్తీర్ణంలోనైనా వివిధ రకాల పంటలు వేశాడు. అన్నీ ప్రకృతి వ్యవసాయ పద్దతులు ద్వారా సాగుచేస్తూ, ఈ విధానం పర్యావరణానికి ఎలా ఉపకరిస్తుందో విద్యార్థులకు బోధిస్తుంటాడు.

Naidu Malyadri
ఆదాయంతో పాటు అవగాహన కూడా

By

Published : Dec 5, 2020, 5:30 PM IST

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బోడిపాలెంలో నాయుడు మాల్యాద్రి అనే యువ రైతు... తనకున్న భూమిలో తన తండ్రి రామారావుతో కలసి వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. రెండున్నర ఎకరా మెట్టలో వివిధ రకాల పండ్లు, కూరగాయల మిశ్రమ వ్యవసాయం చేస్తున్నాడు. మెట్ట భూమిలో శ్రీగంధం తోటలు ప్రధాన పంటగా వేశారు. ఇది కోతకు వచ్చేసరికి దాదాపు 20 ఏళ్ళు పడుతుంది. అంత వరకూ కాళీ ప్రాంతాన్ని వృథాగా వదిలేయకుండా దాదాపు 20 రకాల పంటలు అంతర్‌ పంటలుగా వేశారు. నిమ్మ, దానిమ్మ, జామ, నారింజ, అంజీర, వాటర్‌ ఆపిల్​తోపాటు ఆకు కూరలు సాగుచేశారు .

ప్రకృతి సాగుతో వచ్చే ఆదాయం ఒక్కటే కాకుండా, ఈ క్షేత్రాన్ని విద్యార్థులకు ఓ పరిశీలనా కేంద్రంగా తయారు చేశారు. పట్టణ వాతావరణంలో పెరిగే విద్యార్థులకు వ్యవసాయం అంటే అంతగా అవగాహన ఉండటం లేదు.అందులోను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పూర్తిగా తెలికపోవడాన్ని గమనించిన మాల్యాద్రి విద్యార్థులను రప్పించి, ఇక్కడ అవగాహన కల్పిస్తారు. పర్యావరణ పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి? అందుకోసం వ్యవసాయం ఎంత పాత్ర పోషిస్తుందనే అంశంపై క్షేత్ర పరిశీలన యాత్ర నిర్వహిస్తారు. ఒంగోలు పట్టణంలో వివిధ ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల నుంచి విద్యార్థులను ఈ క్షేత్రానికి తీసుకువెళతారు. ఒకో ట్రిప్‌లో 60, 70 మంది బస్సుల్లో తీసుకువెళ్ళి వారికి అవగాహన కల్పిస్తారు.

పంటలు ఎలా పండిస్తారు.. తడులు ఎలా అందిస్తారు? నేల సారం, ఏ ఏ పంటకు ఎంత దిగుబడి వస్తుంది? సేంద్రియ వ్యవసాయం వల్ల లాభమేమిటి? అనే విషయాలపై వీరికి అవగాహన కల్పిస్తారు. విద్యార్థులతో నాట్లు వేయించడం, కలుపు తొలగించడం, గొప్పులు తవ్వించటం వంటివి కూడా నేర్పిస్తారు. తరగతి గదుల్లో వినే పాఠాలు కన్నా, ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవడం వల్ల విద్యార్థులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఇలా క్షేత్ర పరిశీలనకు ఒకో ట్రిప్ నకు దాదాపు 10వేల రూపాయలు చొప్పున విద్యార్థులు చెల్లిస్తారు. ఏడాదిలో దాదాపు 10 పరిశీలనలు ఉంటాయి.క్షేత్ర పరిశీలనలకు వచ్చిన విద్యార్థులకు కూరగాయలు , వాటి విత్తనాలు కిట్లు అందజేస్తారు. విద్యార్థులు కూడా ప్రత్యేక్షంగా వ్యవసాయ క్షేత్రంలో తిరగడం... ప్రకృతి ఒడిలో రోజంతా గడపడం తో విఙ్ఞానంతో పాటు వినోదం కూడా పొందుతున్నారు. రైతుకు దాదాపు లక్ష రూపాయల వరకూ ఆదాయం లభిస్తుంది.

నా తోటలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతినే అవలంభిస్తున్నాను . ఆవు మూత్రం, పేడలతో జీవామృతం ఘనామృతాలు, వివిధ రకాల ఆకులు, కాయలతో కషయాలు స్వయంగా తయరు చేసుకొని సాగు చేస్తున్నాను . రసాయనాల వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా, ఆరోగ్యం కూడా దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల దృష్టిపెట్టాను . కలుపు నివారణకు కూడా చిన్న చిన్న చిట్కాలతో సమస్యను అధిగమిస్తున్నాను . ఈ మిశ్రమ సాగు వల్ల కొంత ఆదాయం లభిస్తుంది. మూడేళ్ల నుంచీ చేస్తున్న ఈ సాగుతో ఏడాదికి ఎకరాకు దాదాపు 50వేల రూపాయల వరకూ లభిస్తుంది.

:_ నాయుడు రామారావు, రైతు

ఇదీ చదవండీ... నెల్లూరు నగరాన్ని వణికిస్తున్న బురేవి తుపాను

ABOUT THE AUTHOR

...view details