NADU NEDU : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో విడత నాడు-నేడు నిర్మాణ పనుల్లో అలసత్వం విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంటుంది. జిల్లాలో రెండో దశలో 520 ప్రాథమిక పాఠశాలలు, 110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 237 ఉన్నత పాఠశాలలు, 89 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనులు ప్రారంభించారు. అయితే పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణ సామగ్రి సకాలంలో పంపిణీ కాకపోవడంతో తాత్సారం జరుగుతుంది.
సిమెంట్ పంపిణీ చేస్తే, ఇసుక పంపిణీ చేయకపోవడం, లేకపోతే కూలీలు దొరక్కపోవడం.. ఇలా పలు కారణాలతో పనులు ప్రారంభించి రోజులు తరబడి నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. పునాదులకు గోతులు తవ్వి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో ఉర్ధూ పాఠశాలలో అదనపు గది నిర్మాణంలో భాగంగా పునాదులు తవ్వి వదిలేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గోతుల్లో నీరు చేరింది. పాఠశాల పక్కనే ఉన్న ఓ బాలుడు గోతిలో పడి మృతిచెందాడు. బాలుడు చనిపోవడానికి నాలుగు రోజులు ముందే ఇవే గోతుల్లో మరో బాలుడి జారిపడ్డాడు. స్థానికులు అతడిని కాపాడారు. ఇలా అనేక పాఠశాలల్లో గోతులు తీసి వదిలేయడం ప్రమాదకరంగా మారిందని.. స్థానికులు చెబుతున్నారు.