ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తెదేపా మద్దతుదారులు ఇద్దరిపై కొందరు వ్యక్తులు దారి కాచి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న మహిళ భర్తతోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మామిళ్లపల్లి సాగర్ కాలువ వద్ద శనివారం రాత్రి 7.30కు ఈ దారుణం జరిగింది.
సంతమాగులూరు మండలం కుందుర్రు గ్రామానికి చెందిన తెదేపా మద్దతుదారులు బి.కృష్ణయ్య, జి.వీరాస్వామి, మరొకరు కలిసి కొమ్మాలపాడు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన కొందరు మామిళ్లపల్లి కాలువ వద్ద మాటేసి.. వారు రాగానే ఆపి మారణాయుధాలతో దాడి చేశారు. కృష్ణయ్య, వీరాస్వామిల శరీరాల నుంచి కాళ్లు, చేతులు దాదాపు వేరయ్యేంతగా తీవ్రంగా కొట్టారు. మూడో వ్యక్తి మాత్రం చిక్కకుండా పారిపోయాడు. అదే సమయంలో అటుగా కొందరు రావడంతో దుండగులు పరారయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను 108లో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటుచేశారు. కృష్ణయ్య భార్య రాఘవమ్మ తెదేపా ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నందునే వైకాపా నాయకులు ఈ ఘాతుకానికి తెగబడ్డారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. నరసరావుపేట ఆసుపత్రిలో ఉన్న బాధితులను ఆయన పరామర్శించారు.