ప్రకాశం జిల్లాలో పురపోరు.. రంజుగా మారింది. ఒంగోలు నగరపాలక సంస్థ, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు.. చీమకుర్తి, అద్దంకి, గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. కోర్టుల్లో కేసుల వల్ల.. కందుకూరు, దర్శి, పొదిలిలో జరగడం లేదు. ఒంగోలు నగరపాలక సంస్థలో ప్రతి వార్డులోనూ.. వైకాపా తరఫున ముగ్గురు, నలుగురు నామినేషన్లు వేశారు. టికెట్ ఒకరినే వరించే అవకాశం ఉన్నందున.. మిగతావారిని నేతలు బుజ్జగించే యత్నాల్లో ఉన్నారు. వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రలోభ పెడుతున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. గతేడాది నామినేషన్ల సమయంలో 5 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
అద్దంకిలో రోజుకో విధంగా...
ఇక అద్దంకి మున్సిపాలిటీలో పరిణామాలు రోజుకో విధంగా మారుతున్నాయి. ఏడాది కిందట నామినేషన్లు వేసిన అభ్యర్థులు పార్టీలు మారడం వల్ల కాస్త గందరగోళం నెలకొంది. గతేడాది అన్ని వార్డుల్లోనూ తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులు నామినేషన్లు వేయగా మూడో వార్డులో తెలుగుదేశం అభ్యర్థి వైకాపా కండువా కప్పుకొన్నారు. తర్వాత మరో ముగ్గురు వైకాపాలో చేరగా తెలుగుదేశం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇద్దరిని తిరిగి రప్పించారు. 20 వార్డులున్న అద్దంకి నగర పంచాయతీలో.. ఎస్సీ మహిళకు ఛైర్‌పర్సన్ పదవి రిజర్వ్ అయింది.
ఏ వర్గానికి ప్రాధాన్యతో..?
చీరాలలో 33 వార్డులు ఉండగా తెలుగుదేశం తరఫున 20 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. మిగిలిన వార్డుల్లో స్వంతత్రులకు.. మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధికార పార్టీ తరఫున.. ఏకంగా 232 మంది నామినేషన్లు వేశారు. ఇక్కడ ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య తీవ్ర పోటీ ఉంది. అందువల్ల.. పార్టీ ఏ వర్గానికి ప్రాధాన్యత ఇస్తుందన్న అంశంపై ఆసక్తి ఏర్పడింది.