ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెలరేగిపోతున్న మట్టి మాఫియా... ప్రభుత్వ భూమిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు - ఏపీ వార్తలు

Mud Mafia: ప్రకాశం జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వ భూమిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ మట్టిని తరలిస్తున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నా... అక్రమార్కులు అవేమి లెక్కచేయట్లేదు. ఎవరైనా ఈ భూమిలోకి ప్రవేశిస్తే... చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బోర్డులు ఉన్నా.. అవి హెచ్చరికలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా... అధికారులకు తెలియకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

Mud Mafia in Prakasam District
Mud Mafia in Prakasam District

By

Published : Mar 25, 2022, 5:09 AM IST

Mud Mafia: ప్రకాశం జిల్లా ఒంగోలుకు పది కిలోమీటర్ల దూరంలో ఎర్రకొండలు అవతల టంగుటూరు మండలం పరిధిలోని మర్లపాడు కొండలు ఉన్నాయి. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో త్రిపుల్‌ ఐటీ కోసం 2 వందల ఎకరాల భూమిని గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో రెండు వేల ఎకరాలకు పైగా భూములను ఇనుప ఖనిజం తవ్వకాలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన కారణంతో ఇక్కడ త్రిబుల్ ఐటీ ఏర్పాటు సాధ్యం కాలేదు. తర్వాత ఈ కొండ ప్రాంతాల్లో దాదాపు 23 వేల మందికి జగనన్న కాలనీ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి భూమిని చదును చేశారు. పట్టాల పంపిణీకి సరిహద్దు రాళ్లు కూడా పాతారు. ఈ క్రమంలో ఆ భూములు గతంలో తమకు ఇచ్చినవి అని ఖనిజ సంస్థ, యువతకు ఉపాధి లేకుండా పోతుందని గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు మైనింగ్‌కు ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వినియోగించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పట్టాల పంపిణీ నిలిచిపోయింది.

అయితే ఈ కొండ ప్రాంతాల్లోని ఎర్రమట్టి పై కన్నేసిన కొందరు... నెల రోజులుగా జేసీబీ, టిప్పర్లు, టాక్టర్లు పెట్టి పెద్ద మొత్తంలో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఎర్రమట్టిని తవ్వి తరలించిన ఆనవాళ్లు ఈనాడు- ఈటీవీ భారత్ క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగు చూశాయి. కోర్టు ఉత్తర్వులు లెక్కచేయకుండా ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నారు. పట్టాలకు సిద్ధం చేసిన భూములకు పక్కన ప్రభుత్వ భూములలోనూ భారీగా ఎర్రమట్టి తవ్వి గుంతల మయం చేశారు.

మట్టిని తవ్వి ట్రక్కు నింపుతున్న వ్యక్తులను ఈనాడు-ఈటీవీ భారత్ బృందం ప్రశ్నించగా రోజువారి కూలి కోసం ఇక్కడ పని చేస్తున్నట్టు వారు చెప్పుకొచ్చారు. అయితే ఇంత జరుగుతున్నా కనీసం అధికారులు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిప్పర్ ఎర్రమట్టి ప్రాంతాలను బట్టి 5 వేల నుంచి 8 వేల వరకు ధర పలుకుతోంది. అలాంటిది ప్రభుత్వ భూమిలో మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వందలాది టిప్పర్లు రాకపోకలతో రోడ్లు ద్వంసం అవుతున్నాయని, దుమ్ము రేగి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.


ఇదీ చదవండి:రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజల తీర్పును కోరండి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details