పరిషత్ ఎన్నికల కోసం మద్దిపాడు, కొత్తపట్నం ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన.. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ పోల భాస్కర్ పరిశీలించారు. హైకోర్టు తాజాగా స్పష్టత ఇవ్వడంతో.. వేగంగా ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. 99 శాతం ఎన్నికల సిబ్బంది హాజరుకాగా.. సామాగ్రితో పాటు వారిని తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మండలానికొక రిటర్నింగ్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులను పంపామని వెల్లడించారు. ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి, చీరాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
మార్కాపురంలో ఏర్పాట్లిలా...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు యథాతథంగా కొనసాగుతుండటంతో.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలింగ్‌కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. హైకోర్టు తీర్పు కోసం ఇప్పటివరకు సిబ్బంది వేచి చూశారు. న్యాయస్థానం ఎన్నికల నిర్వహణకు పచ్చ జెండా ఊపిన మేరకు.. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లేందుకు ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు.