Attack on subbarao : తనకు ప్రాణహాని ఉందని, నలుగురు హోంగార్డ్‌లతో రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తా. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీని కోరారు. ఇక, తనకు వస్తున్న పరామర్శలపైనా స్పందించారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తనకు ఫోన్ చేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. అయితే.. వారు ఫోన్ చేసినంత మాత్రానా తాను ఆ పార్టీకి చెందిన వాడిని కాదని అన్నారు.
ఏం జరిగిందంటే..
Attack on subbarao : ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై.. అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయి. ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో.. సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
సుబ్బారావుపై దాడి..
గుంటూరులోని బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో సుబ్బారావు గుప్తా తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని అనుచరులు కొందరు ఆదివారం సాయంత్రం 3.40గంటల సమయంలో ఒక పోలీసు వాహనంతోపాటు మరో ప్రైవేటు వాహనంలో ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు. సుభానీ అనే వ్యక్తి సుబ్బారావు గుప్తాపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేశారు. తాను మధుమేహంతో బాధపడుతున్నాననీ, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తనను వదిలిపెట్టాలని గుప్తా వేడుకున్నా వినిపించుకోకుండా దాడి చేశారు.