ప్రకాశం జిల్లాలో మిర్చి అధికంగా సాగయ్యే పర్చూరు ప్రాంతంలో పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అనుమతి మంజూరై ఆర్నెల్లవుతున్నా నేటికీ ప్రారంభానికి నోచలేదు. సాగు విస్తీర్ణం పెరిగినందున స్థానికంగా విక్రయించుకునే అవకాశం కల్పిస్తే రైతులకు దళారుల బెడద తప్పి గిట్టుబాటు ధర లభిస్తుందని అధికారులు భావించారు. దీనికితోడు కరోనా నేపథ్యంలో గుంటూరు యార్డుకు ఎక్కువ సంఖ్యలో రైతులు తమ నిల్వలను అమ్మకానికి తీసుకెళ్తే సమస్య తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించారు. ఆయా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది చోట్ల అదనపు కొనుగోలు కేంద్రాలు నెలకొల్పాలంటూ మార్కెటింగ్ శాఖ కమిషనర్ గత మే 25న ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా పర్చూరు మార్కెట్ యార్డులో మిరప క్రయ, విక్రయాలకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. అయితే అవి నేటికీ అమలులోకి రాలేదు.
ప్రకాశం జిల్లాలో గతేడాది 31,608 హెక్టార్లలో మిరప సాగు చేయగా పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్లోనే 10 వేల హెక్టార్లకుపైగా ఉండడం గమనార్హం. ఎకరాకు 20-30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. సగటున 25 అని లెక్క వేసుకున్నా సుమారు 20 లక్షల క్వింటాళ్ల దిగుబడి రాగా అధిక శాతం శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు. నెల రోజులుగా ధర ఆశాజనకంగా ఉండడంతో అమ్మకాలు జరుపుతున్నారు. ఈ సంవత్సరం సుమారు 40 వేల హెక్టార్లలో పంట సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా. ఖరీఫ్‌లోనే 27,051 హెక్టార్లలో మిర్చి వేయగా గత 20 రోజులుగా మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
అప్పటితోనే సరి..
మిర్చి పంటకు 2018-19లో గిట్టుబాటు ధరలేక రైతులు నష్టపోయే పరిస్థితులు నెలకొనగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషితో అప్పట్లో పర్చూరు యార్డులో కొనుగోలు కేంద్రం మంజూరైంది. మద్దతు ధరకన్నా తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని రైతు ఖాతాకు ప్రభుత్వం జమ చేసింది. ఆ ఏడాది 9,435 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. జిల్లాలో వ్యాపారులు అంతగా లేకపోవడాన్ని ఆసరా చేసుకొని స్థానికులు వారి అవతారమెత్తి రైతుల నుంచి సరకు కొనుగోలు చేసి గుంటూరు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఇలా పర్చూరు మండలం నూతలపాడు, యద్దనపూడి మండలం జాగర్లమూడిలో రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు దాదాపు రూ.2 కోట్ల మేర వారిని మోసం చేశారు. యార్డులో క్రయ, విక్రయాలు జరిగేలా చూస్తే రైతులు దళారుల బారిన పడి నష్టపోయే అవకాశం ఉండదని, లైసెన్సు కలిగిన ట్రేడర్లు మాత్రమే కొనే అవకాశం ఉంటుందని డీసీఎంఎస్ ఛైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త రావి రామనాథంబాబు మార్కెటింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. దాంతో వారు కొనుగోలు కేంద్రం మంజూరు చేసినా నేటికీ ప్రారంభం కాకపోవడంతో రైతన్నలకు ఆశించిన మేలు జరగడం లేదు.