గతేడాది మిర్చి సాగులో అధిక దిగుబడులు రావడంతోపాటు.. అత్యధిక ధర పలికిన కారణంగా... ఈసారి ప్రకాశం జిల్లాలో రైతులు పెద్దఎత్తున సాగు చేపట్టారు. నాగులుప్పలపాడు, ఇంకొల్లు, పర్చూరు, కారంచేడు, మార్టూరు మండలాల్లో... వేలాది ఎకరాల్లో మిరప పంట వేశారు. తొలినాళ్లలోనే పంటకు తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లకు మించి... దిగుబడి రాలేదు. ప్రారంభంలో 16వేల రూపాయలు పలికిన ధర.. ఇప్పుడు పతనమైంది. అయినకాడికి అమ్ముకుందామన్నా.. గుంటూరు మార్కెట్ మూసివేశారు. వ్యాపారులు, దళారులు సైతం కల్లాలవైపు కన్నెత్తి చూడడంలేదు.
వేల క్వింటాళ్ల మిర్చి కల్లాల్లో.. మూలుగుతోంది. ఒకప్పుడు తాలు కాయలూ క్వింటా 9వేలకు కొనేవారని, ఇప్పుడు నాణ్యమైన మిర్చికీ.. 10 నుంచి 12 వేలు కూడా చెల్లించడం గగనంగా మారిందని రైతులు వాపోతున్నారు.. ఈ ఏడాది మిర్చిసాగుకు పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించడంలేదు. కూలీల కొరత ఎక్కువగా ఉంది. స్థానికంగా కూలీలు లేక.. కర్నూలు జిల్లా నుంచి తెప్పించి.. మిరపకాయలు కోశారు. వారికి బస ఏర్పాట్లు.. రానూపోనూ రవాణా ఛార్జీలూ చెల్లించారు. ఇక తమకు మిగిలేదేంటని... అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టం వచ్చేట్లు ఉందని రైతులు తెలిపారు.