ప్రకాశం జిల్లాలో సాగయ్యే పంటలో మిర్చి ప్రధాన పంట. ఏటా దాదాపు లక్ష 50 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో ఈసారి 50 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. పంట మొదట్లో అంతా బాగున్నా.. పూత, కాయ దశ వచ్చేసరికి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. ఎక్కువగా పర్చూరు, అద్దంకి, దర్శి, గిద్దలూరు ప్రాంతాల్లో మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెట్టుబడిలో సగం కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలతో నిండా మునిగిన మిర్చి రైతులు.. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి - prakasam district latest news
ప్రకాశం జిల్లాలో వర్షాలు, తెగుళ్లు మిర్చి రైతులను నిలువునా ముంచేశాయి. గత ఏడాది నవంబర్‌లో కురిసిన వర్షాలతో పంటలు నీట మునిగి తెగుళ్లు సోకడంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కాయ దశలో మంచి దిగుబడులు వస్తాయనుకున్న రైతులకు చివరికి తాలుకాయలే రావడంతో.. పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు.
లక్షలు ఖర్చు చేసినా.. చివరికి అప్పులే మిగిలాయి..
వర్షాలతో పంట దిగుబడి బాగా తగ్గిపోవడంతో పాటు ఎక్కువగా తాలుకాయలే వచ్చాయి. కనీసం పెట్టుబడైనా వస్తుందని ఆశలు పెట్టుకున్న రైతులకు.. అది కూడా లేకుండా పోయింది. కూలీ ఖర్చులు కూడా రావని తెలిసి చాలాచోట్ల పంటలను రైతులు వదిలేశారు. సాగుకు చేసిన అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని రైతులంటున్నారు.మిర్చి సాగును నమ్ముకుని లక్షలు ఖర్చు చేసినా.. చివరికి అప్పులే మిగిలాయని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.