చెంచు గిరిజనుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట - minister
ప్రకాశం జిల్లా డోర్నాలలో ప్రపంచ ఆదివాసీల దినోత్సవంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. చెంచు గిరిజనుల సమస్యలను రాబోయే రోజుల్లో త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వీరికి సేవలు అందించిన పలు అధికారులను సత్కరించారు.
ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా డోర్నాలలో ఏర్పాటు చేసిన వేడుకల్లో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో చెంచు గిరిజనులు హాజరయ్యారు. మంత్రి పట్టణంలో చెంచు గిరిజనులతో కలసి నడుచుకుంటూ కల్యాణ మండపం వరకు వచ్చారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చెంచు గిరిజన విద్యార్థినులకు సైకిళ్ళు, మహిళా గిరిజనులకు కుట్టు మిషన్లు, చెంచు రైతులకు విద్యుత్ మోటార్లు, పైపులు పంపిణీ చేశారు. గుడారాల్లో గిరిజనులకు సేవలు అందించిన అధికారులను సత్కరించారు. చెంచు గిరిజనులకు అనేక సమస్యలు ఉన్నాయని రాబోయే రోజుల్లో అన్ని పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని చెంచు గుడాలకు రహదారులు సరిగ్గా లేవని అందుకోసం 42 రోడ్లు వేసేందుకు రూ.22 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే రోజుల అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.