"త్వరలో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి శాశ్వత భవనాలు" - ongole iiit
ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సాధ్యమైనంత త్వరగా శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట సహా ఆయన పాల్గొన్నారు.
గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రయోగం ట్రిపుల్ ఐటీ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జేయూకేటి) ఉప కులపతి కేశిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి సురేశ్ మాట్లాడారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రారంభించి నాలుగు సంవత్సరాలైనా ఇప్పటికీ ఇక్కడ తరగతులు కడప జిల్లా ఇడుపులపాయలో నిర్వహించడం బాధాకరమని అన్నారు. అందువల్ల తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఒంగోలులో ప్రైవేట్ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా శాశ్వత భవనాలు నిర్మిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఈ విద్యా సంస్థలకు చెందిన 185 కోట్ల రూపాయలను పసుపు-కుంకమ వంటి పథకాలకు మళ్లించిందని అందువల్లనే శాశ్వత భవనాలు నిర్మాణాలకు నోచుకోలేదని ఆరోపించారు. అనంతరం విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాల కల్పనకు తనవంతు కృషి చేస్తామని అన్నారు. ఆర్జీయూకేటి ఉపకులపతిగా కేశి రెడ్డి ఉండటం వల్ల ట్రిపుల్ ఐటీలు అభివృద్ధి దిశగా పయనిస్తాయనడానికి అతిశయోక్తి లేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం మాగుంట సుబ్బరామిరెడ్డి పేరుమీద సి.విటమన్ మాత్రలు తాను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్జీయూకేటీ వీసీ కేశిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఒంగోలు ట్రిపుల్ ఐటీకి నిధులు మంజూరు చేస్తే ఆరు నెలల్లో శాశ్వత క్యాంపస్ నిర్మిస్తామని అన్నారు. సమావేశంలో కలెక్టర్ భాస్కర్, ట్రిపుల్ ఐటీ డైరక్టర్ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.