ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించి సొంత కాళ్లపై నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ, జగనన్న తోడు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కేవలం ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే కాకుండా.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు.
కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా.. పేదలకు అండగా ఉంటామని చెప్పారు. ఇచ్చిన హామీని అమలు చేయటంలో ముఖ్యమంత్రి ఏమాత్రం వెనకడుగు వేయలేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో నిష్పక్షపాతంగా అర్హులందరికీ ప్రయోజనం కల్పిస్తున్నామన్నారు. ఆయా పథకాల్లో లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించి అత్యంత పారదర్శకంగా వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.