ప్రకాశం జిల్లా మక్కెనవారిపాలెంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఆ పార్టీ వారికే ఇచ్చారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పార్టీలకు అతీతంగా ఇచ్చారని గుర్తుచేశారు. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చే బాధ్యత వాలంటీర్లపై ఉందని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలాలు, పింఛన్లు అందించాలని సూచించారు.
ప్రతీ పేదవాడికి ఇల్లు...
ముఖ్యమంత్రి జగన్... రాష్ట్రంలో గుడిసె లేకుండా చేసే ప్రయత్నం చేపట్టారని, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. నవరత్నాల్లో భాగంగానే జనవరి 9న అర్హులందరికీ అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సంతమాగులూరు మండలంలోని అన్ని గ్రామాల్లో వైకాపా జెండా ఎగురవేసే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.