ఒంగోలు నగర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు నగర పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన సోమవారం శ్రీకారం చుట్టారు. పులివెంకటరెడ్డి కాలనీ నుంచి కొప్పోలు వరకు కోటీ 90 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎఫ్.సి.ఐ. రోడ్డులో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు.
రిమ్స్ ఆస్పత్రి వెలుపల కోటీ లక్షల రూపాయల వ్యయమైన డ్రైనేజీ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 15వ ఆర్థిక సంఘం నిధులు 10 కోట్ల రూపాయలతో ఒంగోలు నగరంలో అవసరమైన చోట్ల డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. రహదారుల నిర్మాణానికి కూడా త్వరలో నిధులు మంజూరు చేయించి పనులు చేపడతామన్నారు. పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని... 90 కోట్ల రూపాయల వ్యయంతో త్వరలో నల్ల కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.