ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో సీసీ రోడ్లకు నిధులు ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై మంత్రితో చర్చించారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు లేవని ముఖ్యంగా చెంచు గిరిజన కాలనీల్లో రోడ్ల నిర్మాణాలకు దాదాపు రూ.10 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కోరారు. ఇంకా గతంలో చేసిన పనులకు కూడా నిధులు మంజూరు కాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని పరిశీలించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సురేశ్ అభ్యర్ధనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి యర్రగొండపాలెం నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు.