రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు.. అమూల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో పాలను సేకరించడానికి సంకల్పించినట్లు వెల్లడించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో.. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో పాలసేకరణ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు.
తన పాదయాత్రలో పేర్కొన్న 'పాడిపంటలు ఉన్న ఇంట సిరులొలుకు' మాటకు అనుగుణంగా.. రైతులు, మహిళలకు మేలు జరిగే విధంగా కార్యక్రమం చేపడుతున్నామని సీఎం జగన్ వివరించారు. లీటరు పాలకు ఇప్పుడున్న ధర కంటే.. నాలుగు నుంచి ఐదు రూపాయల వరకు లాభం పొందాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. మనం పాల ధరలు పెంచితే ప్రైవేటు డెయిరీలూ మన బాటలోనే నడుస్తాయన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో అంతరాయం కారణంగా.. రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించలేకపోయారు.