Migration In West Prakasam : సమస్తజీవులకు నీరే జీవనాధారం.. సాగు చేయాలన్నా, జీవనం సాగించాలన్నా నీటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పట్టుకొమ్మల్లాంటి పల్లెలు పచ్చగా ఉండాలన్నా సాగు, తాగు నీరే కీలకం.. అలాంటి పల్లెలలకు ఇప్పుడు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. తాగటానికైతే ఒకటో రెండో కిలోమీటర్లు వెళ్లి డబ్బాలు తెచ్చుకొని ఏదోలా సర్ధుకుంటాం. మరి మూగజీవులకు, పంటలకు ఎక్కడి నుంచి తెస్తాం.. అవి లేకపోతే పనులు ఎలా పుట్టుకొస్తాయి? అందుకే పల్లెలొదిలి పట్టణాలకు వలసపోతున్నాం.. అంటున్నారు గ్రామీణ ప్రజలు.. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి చాలా గ్రామాల్లో కనిపిస్తోంది.
ఇంకిపోయిన భూగర్భ జలాలు.. బీడు భూమిగా మారిన పొలాలు : పనులు కోసం పొట్ట చేతపట్టుకొని ప్రకాశం జిల్లాలో చాలా గ్రామాల ప్రజలు పట్టణాలకు వలస పోతున్నారు. పొలాలు ఉన్నా, సాగుకు నీరు లేక ఈ పరిస్థితి నెలకొంది. తాగు, సాగు నీటి ఇబ్బందులే బతుకు కోసం బస్తీల వైపునకు అడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో కరువు పరిస్థితులు రైతులను, కూలీలను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. కేవలం వర్షాధారంతోనే సాగు చేసే భూములకు మరే ఇతర సాగు వనరులు లేక వ్యవసాయం కష్టమవుతోంది. భూగర్భ జలాలు కూడా ఇంకిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఎకరా, రెండు ఎకరాలు ఉన్న రైతులు సాగునీటి వసతి లేక బీడులుగా వదిలేసి ఇతర ప్రాంతాలకు కూలీ పనుల కోసం వెళ్లిపోతున్నారు.
బతకడానికి వలసలు :పశ్చిమ ప్రాంతంలో తాగునీటి కోసం అనేక గ్రామాలకు సాగర్ నీళ్లే ఆధారం. కానీ పూర్తి స్తాయిలో నీటి సరఫరా ఏర్పాట్లు లేక ఇప్పటికీ ఐదు రోజులకొక సారి మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు కూడా మూడు రోజులకొక సారి సరఫరా చేస్తారు. ఈ నీళ్లు తాగేందుకు, ఇతర అవసరాలకు చాలీ చాలినట్లు ఉంటున్నాయి. ఇక పశువులకు, జీవాలకు నీళ్లు లేక అమ్ముకోవలసి వస్తోంది. తాగునీటికే ఇంత కష్టంగా ఉంటే సాగునీటి పరిస్థితి చెప్పనక్కరలేదు. అందుకే పశ్చిమ ప్రాంతంలో చాలా గ్రామాల్లో పొలాలు బీళ్లుగా మారిపోతున్నాయి. ఇక్కడ పనుల్లేక వలస పోవాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు.ఈ పరిస్థితుల్లో సొంత ఊరిని వదిలేసి పనుల కోసం విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు వలస పోతున్నారు.