ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్తి కోసం.. మేనత్తనే అంతం చేయాలనుకున్నాడు... - ప్రకాశం జిల్లా వార్తలు

తల్లిదండ్రులు చనిపోవడంతో అత్తే అమ్మలా సాకింది. నాన్నలా మంచి చెడ్డలు చూసుకుంది. అంత చేసిన ఆమెనే అంతం చేయాలని చూశాడు కర్కశుడు. ఆస్తి రాయలంటూ లేకుంటే గ్యాస్ సిలిండర్ పేల్చి చంపుతానని బెదిరించాడు. పోలీసులు చాకచక్యంగా శ్రమించి ఆమెను కాపాడారు.

men Threats his aunt about property
men Threats his aunt about property

By

Published : Sep 2, 2021, 9:57 AM IST

అమ్మలా ఆలనాపాలనా చూసిన అత్తనే అంతమొందించేందుకు సిద్ధమయ్యాడా కర్కశుడు .. కిడ్నాప్‌ చేసి ఇంట్లో బంధించి సిలిండర్‌తో తగులబెట్టేందుకు ప్రయత్నించాడు .. బాధితురాలి కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు రంగం ప్రవేశం చేసి నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

ఎస్సై వి.శివన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం .. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో ఫ్యాక్షన్‌ నేపథ్యమున్న అట్లా బాలిరెడ్డి గతంలో హత్యకు గురయ్యాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు చినవెంకట రెడ్డి ఉన్నారు. తండ్రి చనిపోవడంతో మేనత్త మందాల బాలేశ్వరి అతడి మంచి చెడ్డలు చూసి పెంచి పెద్ద చేసింది. ఆమె గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం వేమవరంలో ఉంటోంది. బుధవారం ఉదయం వెంకట రెడ్డి వేమవరం వెళ్లాడు. తనతో పాటు సంతమాగులూరు రావాలని లేకుంటే ఇనుప రాడ్‌తో కొట్టి చంపుతానని బెదిరించి సొంతింటికి తీసుకొచ్చాడు. ఆస్తి అంతా తన పేరున రాయాలని లేకుంటే గ్యాస్‌ సిలిండర్‌ పేల్చి తగులబెట్టేస్తానని బెదిరించాడు. చెప్పిన విధంగానే బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ గదిలో ఆమెను బంధించి ఇనుప గ్రిల్స్‌కు, ఇంటికి తాళాలు వేసేశాడు. ఈ విషయం బాధితురాలి కుమార్తెకు తెలిసింది. ఎక్సైజ్‌ ఎస్సైగా పనిచేస్తున్న ఆమె తన తల్లి కిడ్నాప్‌కు గురైందన్న సమాచారాన్ని స్థానిక పోలీసులకందించారు. తక్షణం స్పందించిన ఎస్సై వి.శివన్నారాయణ ఏఎస్సై వెంకటరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ మస్తాన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, బలరాంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో ఉన్న అతనితో సంప్రదింపులు జరిపారు. దాదాపు గంటన్నర శ్రమించి ఇంటి వెనుక వైపు నుంచి చాకచక్యంగా లోపలికి ప్రవేశించారు. ఇది గమనించిన నిందితుడు పోలీసులపై దాడికి దిగాడు. అక్కడే ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేల్చేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకుని అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా దిశ పీఎస్‌ల ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళనకు లోకేశ్ పిలుపు..

ABOUT THE AUTHOR

...view details