ప్రకాశం జిల్లా ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో వేల ఎకరాల్లో విస్తరించిన బంగినపల్లి మామిడికి ప్రత్యేకత ఉంది. సాధారణ మామిడి కంటే ఉలవపాడు మామిడికి ఉన్న డిమాండ్ కారణంగా మంచి ధర కూడా పలుకుతుంది. లాక్‌డౌన్ కారణంగా ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయి వ్యాపారం లేక రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఉలవపాడు మామిడికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి, సౌకర్యాలు కల్పించి రైతులను ఆదుకుంటామని కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చెబుతున్నా... అవి కార్యరూపం దాల్చడంలేదు. దీంతో రైతులు, వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు.
పదేళ్ల క్రితం 4 ఎకరాల విస్తీర్ణంలో ఉలవపాడుకు 8 కిలోమీటర్ల దూరంలో వీరేపల్లి దగ్గర మామిడి మార్కెట్ యార్డు నిర్మించారు. శీతల గిడ్డంగులు, రైతు విశ్రాంతి గదులు, కాటా వంటివి ఏర్పాటు చేయాల్సి ఉండగా..... చిన్నచిన్న షెడ్లు మాత్రమే నిర్మించారు. ఫలితంగా ఒక్క ఏడాది కూడా ఇక్కడ వ్యాపారాలు సాగలేదు. పైగా కొద్దిరోజుల నుంచి ఇక్కడ ఇసుక డంపింగ్ యార్డు నిర్వహిస్తున్నారు. లోపలికి వెళ్లేందుకు కూడా మార్గం లేకపోడంతో... మార్కెట్ యార్డు రైతులకు ఉపయోగపడకుండా వృథాగానే మిగిలిపోయింది.