9 మంది కూలీల జీవితాలు చీకటైపోయాయి. ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండల రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా రాపర్ల సమీప గ్రామాలకు చెందినవారిగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్, మరో మహిళ తీవ్రగాయాలు కాగా.. వీరిని చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు. ఘటనాస్థలిని జాయింట్ కలెక్టర్ మురళి పరిశీలించారు. మృతదేహాలను కాసేపట్లో ఒంగోలు రిమ్స్‌కు తరలించనున్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాట్లు కల్పించడంతో ఈ రోజు ఉదయం కొందరు కూలీలు ట్రాక్టర్‌పై మిరప కోత పనులకు వెళ్లారు. గతంలో ఆటోలలో వెళ్లే వీరంతా లాక్‌డౌన్ నేపథ్యంలో వాటికి అనుమతి లేకపోవడంతో ట్రాక్టర్‌లో పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం మిరప కోత పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఇంటికి చేరుకొనే లోపే విగతజీవులుగా మారడం అందరినీ కలచివేస్తోంది. మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.