ప్రకాశం జిల్లా త్రిపురాంతక క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. త్రిపురాంతకేశ్వరుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. పెద్ద ఎత్తున స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయం వద్ద దేవస్థాన సిబ్బంది చలవ పందిళ్లతో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
శ్రీశైలం మల్లన్న ఆలయానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతక క్షేత్రం.. అతి పురాతనమైనది. త్రిపురాసుర సంహారం జరిగిన ప్రాంతం కావడంతో పాటు ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ చక్ర పీఠంపై నిర్మితమైన ఏకైక ఆలయం ఇది. ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్లి పూజ చేసినా.. త్రిపురాంతకేశ్వరుని జపం ఉచ్ఛరించాల్సిందే. అంతటి మహిమాన్వితమైన త్రిపురాంతక క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.