మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ప్రాంత కూలీలకు వేసవిలో ఇతర పనులు లేని పరిస్థితిలో పనులు చూపించి, ఉపాధి కల్పించాలి. ప్రతీ ఏటా కూలీలు ఎంతో కొంత ఉపాధితో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 100 రోజులు పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇరత వ్యవసాయ, నిర్మాణ పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. జాబ్ కార్డు ఉన్న కుటుంబానికి 100రోజులు చొప్పున పని కల్పించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
అయితే కుటుంబంలో ఇద్దరు, లేదా ముగ్గురు పనిచేసుకుంటే అదే వందరోజులను వాటాలుగా వేసుకొంటారు. అంటే ముగ్గురున్న కుటుంబానికి దాదాపు నెలరోజులే పని ఉంటుంది. మిగతా సమయంలో ఖాళీగా ఉండాల్సిందే. ఇది నిబంధనయినా కష్టపడ్డానికి ఓపిక, అవకాశం ఉన్నా మిగతా రోజులు జీవనానికి వేరే పనులు చూసుకోవాల్సింది.
ఈ ఏడాది కూడా అదే నిబంధనతో ఏప్రిల్ నుంచి దాదాపు 100రోజుల పని రెండునెలలకే పూర్తైన కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రతీ సంవత్సరంలా కాకుండా ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. కొవిడ్ కారణంగా లాక్ డౌన్ అమలు వల్ల ఇతర పనులకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉపాధి హమీ పనులు పూర్తి చేసుకున్న తరువాత లౌక్ డౌన్ కారణంగా పనుల్లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జల్లాలో దాదాపు 683 కోట్ల రూపాయల పనులు చేపట్టారు. 4.77లక్షల మందికి జాబ్ కార్డులుండగా ఇందులో 37వేల కుటుంబాలు 100 రోజులు పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు ఇంకా 100 రోజులు పూర్తి కాని కుటుంబాలుగా ఉన్నాయి. మిగిలిన రోజులు పనులు చేసుకోడానికి అవకాశం ఉన్నా, ఒక ముఠాలో మిగిలిన కొద్ది మందితో పనులు చేయడానికి అంత సుముఖత కనిపించడంలేదు.