ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళం తలెత్తింది. సంయుక్త కలెక్టర్ బాపిరెడ్డి, ఆర్డీఓ ప్రభాకర రావు మండల కేంద్రం కొత్తపట్నంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. కొందరు వైకాపా నేతలు, సానుభూతిపరులు సమ్మతిస్తున్నట్లు మద్దతిచ్చినా.. మెజార్టీ ప్రజలు హార్బర్‌కు వ్యతిరేకంగా అభిప్రాయం తెలిపారు. హార్బర్ వల్ల ఏ మత్య్సకార గ్రామం కూడా బాగుపడింది లేదని.. తమకు జెట్టి నిర్మిస్తే చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
హార్బర్ ప్రాముఖ్యాన్ని అధికారులు వివరిస్తుండగానే గ్రామస్థులు సభను బహిష్కరించి వెళ్లిపోయారు. తీరంలో అతి పెద్ద గ్రామమైన కొత్తపట్నంలో హార్బర్ నిర్మించడం వల్ల గ్రామం ఉనికి కోల్పోతుందని అభిప్రాయపడ్డారు. పెద్ద వ్యాపారులు, గుత్తేదారుల చేతుల్లోకి హార్బర్ వెళ్ళిపోయి మత్స్య కారులు ఇబ్బందులు పడతారని గ్రామస్థులు పేర్కొన్నారు. హార్బర్ ఆలోచన విరమించాలని డిమాండ్ చేశారు. రహదారిపైకి వచ్చి హార్బర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.