మద్యం మత్తులో పల్లెపోరు:నాలుగు విడతలుగా జరిగే ఎన్నికల్లో అనధికారిక మద్యం అమ్మకాలను నియంత్రించడం కష్టతరంగా మారింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు గ్రామాల్లో మద్యం అనధికారిక అమ్మకాలు విఘాతాన్ని కలిగిస్తున్నాయి. మద్యం మత్తులో అధిక శాతం మంది గొడవలకు దిగుతుండటంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.
ప్రలోభాలకు ఇదే ఆయుధం
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం ప్రధాన వనరు. చాలా మంది నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు నామినేషన్లు వేసిన రోజు నుంచే మద్యం సరఫరా చేస్తుంటారు. సారా, అనధికారిక మద్యం సేకరించి.. ఓటర్లకు పంచడం ద్వారా వారి ఓట్లను రాబట్టుకునేందుకు నాయకులు పావులు కదుపుతున్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ప్రధాన పార్టీల మద్దతుదారులు.. మద్యం లేనిదే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సెబ్ అధికారులు అద్దంకి సమీపంలో కుట్టవారిపాలెం, యర్రగొండపాలెం సమీపంలో మిల్లంపల్లి టోల్‌ప్లాజా వద్ద, దోర్నాల- శ్రీశైలం రహదారిని జిల్లా సరిహద్దు ప్రాంతాలుగా గుర్తించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా అడ్డదారుల్లో మద్యం పల్లెలకు చేరుతూనే ఉంది.
తెలంగాణ నుంచే అత్యధికం.. : తెలంగాణ నుంచి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యమే అధికంగా ఉంది. సెబ్ అధికారుల దాడుల్లో దొరుకుతున్న వాటిలో తెలంగాణ మద్యం కేసులే అధికంగా ఉన్నాయి. ఇటీవల 1,104 (23 కేసులు) మద్యం సీసాలను రెండు కార్లలో తరలిస్తుండగా త్రిపురాంతకం వద్ద అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏపీ సరిహద్దులోని విజయపురి సౌత్ గుంటూరు జిల్లా చెక్‌పోస్టులో పనిచేసే ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు సెబ్ అధికారుల విచారణలో తేలింది. పోలీసు సిబ్బందే మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.