70 ఎకరాల ఆసామికి ఇల్లాలైనా.. పిడికెడు బువ్వ కోసం అలమటిస్తున్న ఈ అవ్వ పేరు లక్ష్మీకాంతమ్మ. వయసు 75 ఏళ్లు. ప్రకాశం జిల్లా కొండపి మండలం కె.ఉప్పలపాడు బస్టాండులో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. క్షణమొక యుగంలా నెట్టుకొస్తున్నారు. చోడవరం ఈమె సొంతూరు.
చీమకుర్తికి చెందిన డెబ్బై ఎకరాల ఆసామి సూర్యనారాయణను 60 ఏళ్ల కిందట వివాహమాడారు. ఈమెకు నలుగురు కుమారులు. 30 ఏళ్ల కిందట భర్త మరణించగా- పెద్ద కుమారుడు ఆంజనేయ ప్రసాద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 15 సంవత్సరాల క్రితం కన్నుమూశారు. రెండో కుమారుడు వెంకట వేణుగోపాల ఫణి ఐటీసీలో విధులు నిర్వర్తిస్తూ పదేళ్ల కిందట క్యాన్సర్‌తో చనిపోయారు. మూడో కుమారుడు శివరామశర్మ, నాలుగో తనయుడు శ్రీనివాసశర్మ అనారోగ్య కారణాలతో తనువు చాలించారు.
ఆస్తిపాస్తులున్నన్ని రోజులు వచ్చిన బంధువులు తర్వాత ఆ ఇంటివైపు రావడం మానేశారు. ఈ క్రమంలో సుమారు పదేళ్ల కిందట మెట్టినిల్లు వదిలి బయటకు వచ్చేశారు. కొన్నాళ్లు గుడి మెట్లపై యాచిస్తూ పొట్ట నింపుకొనేవారు. వయసు పైపడేకొద్దీ నడవలేని స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం కె.ఉప్పలపాడు ఆర్టీసీ బస్‌షెల్టర్‌లో తలదాచుకుంటున్నారు.