ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సం‘క్రాంతి’ బాటలో లక్ష్మీనగర్‌.. 75వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

Lakshminagar Village: ఒకప్పుడు అదో అటవీ ప్రాంతం. అక్కడికి కొన్ని కుటుంబాలు వలస వచ్చి బీడు భూములను కొని వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. అలా నాడు వలస ఆవాసం.. నేడు ఆదర్శ గ్రామంగా మారింది. అంతే కాకుండా ఏటా సంక్రాంతికి గ్రామ పుట్టిన రోజును జరుపుకుంటారు. ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

lakshminagar
lakshminagar

By

Published : Jan 15, 2023, 9:55 AM IST

Lakshminagar Village: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది అది.. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి నుంచి వలస వెళ్లిన కొన్ని కుటుంబాలు.. తెలంగాణలోని మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో బీడు భూములు కొనుగోలు చేసి వ్యవసాయం ఆరంభించాయి. అక్కడే పూరిగుడిసెలు వేసుకొని లక్ష్మీనగర్‌ పేరుతో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అలాంటి గ్రామం నేడు చక్కటి రహదారులు, వాటర్‌ ప్లాంట్‌, సీసీ కెమెరాలు, గ్రామం పేరుతో వెబ్‌సైట్‌, ఫంక్షన్‌ హాల్‌, సోలార్‌ వీధి దీపాలు.. ఇలా అన్ని హంగులూ సమకూర్చుకుని ఆదర్శ గ్రామంగా రూపుదాల్చింది.

ఐక్యంగా సాగడం, కమిటీలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పనులు నిర్వహించుకోవడం తమ విజయ రహస్యమని గ్రామస్థులు చెబుతున్నారు. ఏటా సంక్రాంతికి గ్రామ పుట్టిన రోజు జరుపుకోవడం వారికి ఆనవాయితీ. ఆ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద.. ఏడాదిలో మృతి చెందిన వారికి పేరు పేరునా నివాళులర్పించడం మరో విశేషం. ఈ సంక్రాంతికి లక్ష్మీనగర్‌ 75వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడానికి గ్రామస్థులంతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఐక్యతతో ‘క్రాంతి’ పథంలో అడుగులు వేస్తున్న లక్ష్మీనగర్‌ విశేషాలివి.

220 కుటుంబాలు.. 1200 జనాభా:అప్పట్లో కొత్తపల్లి పంచాయతీలో భాగంగా ఉన్న లక్ష్మీనగర్‌ 1995లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. గ్రామస్థులు విరాళాలు సేకరించి పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నారు. గ్రామంలో 220 వరకు నివాసాలు.. 1,200 మంది జనాభా ఉన్నారు. వాటర్‌ ప్లాంట్‌ కమిటీ, హరితహారం కమిటీ, ఆలయ కమిటీ, సర్వే కమిటీ, ఆక్టివ్‌ వాలంటీర్‌ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఆయా పనులను నిర్వహించుకుంటున్నారు.

ఈ గ్రామానికి చెందిన పెండ్యాల ప్రసాద్‌ (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు) సంకల్పంతో 2014లో 11 మందితో సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2019లో గ్రామానికి చెందిన అనురాధ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఉన్నవారికి కొత్తగా స్వయం ఉపాధి కల్పించే మార్గాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

సాధించారిలా:గ్రామంలో తాగునీటి ఎద్దడితో పాటు ఫ్లోరైడ్‌ సమస్య ఉండేది. బాలవికాస సంస్థ సహకారంతో 2015లో నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రూ.8 లక్షలతో భవనం నిర్మించారు. భద్రతలో భాగంగా 13 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు నిర్మించుకున్నారు. 2015లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం ప్రారంభించారు. ప్రతివీధిలో సౌర దీపాలు ఏర్పాటు చేసుకున్నారు.

సర్కారు, దాతల సహకారంతో రూ.10 లక్షలతో 2019లో వైకుంఠధామం నిర్మించుకున్నారు. 2017లో లక్ష్మీనగర్‌ ప్రగతి సెంటర్‌ పేరుతో రూ.50 లక్షలతో ఫంక్షన్‌హాల్‌ నిర్మించుకున్నారు. అవర్‌లక్ష్మీనగర్‌.కామ్‌ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించి.. ఎప్పటికప్పుడు గ్రామ విశేషాలను అందులో పొందుపరుస్తున్నారు. ‘‘కమిటీల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాం. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌ లక్ష్మీనగర్‌’ నినాదంతో మరిన్ని సంక్షేమ పనులు చేపట్టబోతున్నాం. ల్యాబ్‌తో కూడిన జనరిక్‌ మెడికల్‌ దుకాణం ఏర్పాటుతో పాటు, మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం’’ అని పెండ్యాల ప్రసాద్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details