KV Palem People Facing Water Problems : సాగర్ జలాలతో గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పథకాలను అయితే ప్రారంభించారు కానీ.. నిర్వహణకు సరిపడా విద్యుత్ సరఫరా విషయంలో మాత్రం చర్యలు తీసుకోలేదంటున్నారు స్థానికులు. విద్యుత్ సరఫరా సరిగా లేక అనేక గ్రామాల ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. ఎగువున నీటి వనరులు సమృద్ధిగా ఉన్నా.. దిగువ గ్రామాలకు మాత్రం తాగునీరు అందించలేని దుస్థితి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలంలో నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందని.. పట్టించుకునే వారు లేరంటున్నారు బాధిత గ్రామాల ప్రజలు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని గ్రామాలకు రామతీర్థం జలాశయం ద్వారా తాగునీటి సరఫరా పథకాలను అమలు చేస్తున్నారు. తాళ్లూరు, కందుకూరు, కేవీ పాలెం, కనిగిరి ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించేందుకు.. పుష్కర కాలం కిందట పంపింగ్ స్కీమ్‌లను ప్రారంభించారు. ఈ క్రమంలో తాళ్లూరు, కేవీ పాలెం, కనిగిరి ప్రాంతాలన్నిటికీ కలిపి ఈ స్కీమ్ కింద కేవలం రెండు విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లను మాత్రమే ఏర్పాటు చేశారు. అధికారికంగా కేవీ పాలెం స్కీమ్‌కు ట్రాన్స్ ఫార్మర్‌ను కేటాయించలేదు. ఇప్పటివరకు ఉన్న రెండు ట్రాన్స్‌ఫార్మర్లతోనే.. అన్నింటిని నడిపించారు. ప్రస్తుతం తాళ్లూరు, కనిగిరి ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. మోటార్లు సామర్థ్యం చాలకపోవడంతో కేవీ పాలెం మోటర్లకు ఉన్న కనెక్షన్లను తొలగించారు. దీంతో కేవీ పాలెం స్కీమ్‌కు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా దిగువ గ్రామాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి.
రామతీర్ధం జలశయంలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో దిగువ గ్రామాలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. కేవీ పాలెం స్కీమ్‌లో భాగంగా ఓబచెత్తపాలెం, దేవరపాలెం, నిప్పెట్ల పాడు, మర్రిచెట్ల పాలెం.. ఇలా సుమారు 30 గ్రామాలకు 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. నీళ్లు లేక ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేక వందల రూపాయిలు ఖర్చు చేసి నీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.