ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శివనామస్మరణతో.... మారుమ్రోగిన ఆలయాలు - karthika somavaram

కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువజాము నుంచే భక్త జనం పూజలు చేసేందుకు శివాలయాలకి తరలివచ్చారు.

కార్తీక మాసం

By

Published : Nov 4, 2019, 11:45 PM IST

కార్తీక మాసం

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా నదీ తీరాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు.

లక్ష తమలపాకులతో పూజ

పశ్చిమగోదావరిలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, చింతలపూడి, కొవ్వూరు, తదితర గ్రామాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాల వద్ద బారులు తీరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం ఆంజనేయస్వామి ఆలయంలో లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. కార్యక్రమానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు

శివనామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలోని శివ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగాయి. కొత్తపేట మండలం పలివెల శ్రీ ఉమాకొప్పిశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో పూజలు చేసి దీపారాధన కార్యక్రమం నిర్వహించారు.

భక్తుల సందడితో... ఆలయాలు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంగోలులో శైవాలయాలు కిక్కిరిశాయి. భక్తులు భారీగా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరులోని ఆలయాల్లో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చీరాలలో లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితులు కార్తిక మాసం ప్రాముఖ్యత భక్తులకు వివరించారు.

రావి,ఉసిరి చెట్టు కింద ప్రత్యేక దీపారాధన

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉసిరి చెట్టుకింద కార్తీక దీపాలను వెలిగించారు. కర్నూలులో మహిళలు ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు.

ప్రత్యేక అభిషేకాలు

విజయవాడ కృష్ణా నదికి భక్తులు పోటెత్తారు. నదిలో పుణ్యస్నానమాచరించి దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నందిగామలోనూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

నదుల్లో పుణ్యస్నానాలు

రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. స్వామివారికి జరిగే మూలవిరాట్ అభిషేకాలు, మండప అభిషేకాలలో భక్తులు పాల్గొన్నారు. సూర్యలంక తీరంలో నిర్వహించిన సాగర హారతిలో ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. అమరావతి అమరేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహిళలు వేకువజాము నుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను నదిలో వదిలారు.

భక్తులతో పోటెత్తిన ఆలయాలు

విజయనగరం జిల్లాలో కార్తీకమాసం మొదటి సోమవారం ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి పార్వతీపురం డివిజన్​​లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్వతీపురం మండలం అడ్డాపు శిల భక్తులతో రద్దీగా కనిపించింది. కొండ గుహలో కొలువైన శివుని భక్తులు దర్శించుకున్నారు అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

పంచామృతాలతో అభిషేకాలు

కడప జిల్లా వ్యాప్తంగా ఓం నమశ్శివాయ హర హర శంభో శంకర నామస్మరణలతో శివాలయాలు మారుమ్రోగాయి. రాజంపేట పట్టణంలో వేసిన పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తజనం స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు.పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జన్మస్థలి తాళ్ళపాక లో వెలసిన సిద్దేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పూజలు

ప్రముఖ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో కార్తీక సోమవారం దృష్ట్యా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా వేకువ నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకునేందుకు బారులు తీరారు .ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక పూజలు,అభిషేకాలు

విశాఖ జిల్లా అనకాపల్లి లోని శివాలయాల్లో భక్తజనం పోటెత్తారు.అనకాపల్లిలో సిద్ది లింగేశ్వర, భోగ లింగేశ్వర, కాశీ విశ్వేశ్వర, ఉమా రామలింగేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం నుంచి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

ఇవీ చదవండి

ముక్కంటికి అభిషేకాలతో... కార్తీక దీపాలతో..

ABOUT THE AUTHOR

...view details