ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యాటక శోభ సంతరించుకోనున్న కనిగిరి దుర్గం దొరువు - Kanigiri latest news

ప్రకాశం జిల్లా కనిగిరి దుర్గం దొరువు కొత్త శోభ సంతరించుకోనుంది. సుమారు ఐదు కోట్ల వ్యయంతో చుట్టుపక్కల ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలను కలుపుతూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ తెలిపారు. ఈ పక్రియ అంతా డిసెంబర్ నాటికల్లా పూర్తి అవుతుందని చెప్పారు.

kanigiri
కనిగిరి దుర్గం దొరువు
author img

By

Published : Jun 15, 2021, 3:19 PM IST

కనిగిరి దుర్గం దొరువుకు కొత్త హంగులు

ప్రకాశం జిల్లా కనిగిరి కొండకు దిగువన ఉన్న దుర్గం దొరువు మరింత అందాలను సంతరించుకోనుంది. ఆనాటి రాజుల కాలంలో కనిగిరి ప్రాంత ప్రజలకు తాగునీటి కొరత లేకుండా కొండపైన పడిన వర్షపు నీటికి అడ్డుగా పెద్ద రాతితో దొరువు నిర్మించారు. కొన్ని వందల సంవత్సరాలు తాగేందుకు స్వచ్ఛమైన నీటిని అందించిన ఈ దొరువుకు జిల్లాలో ఓ ప్రత్యేక స్థానం ఉండేది.

అయితే కాలక్రమేణా దాన్ని పట్టించుకోకపోవటంతో దొరువు రూపురేఖలే మారిపోయాయి. మంచినీటి దొరువు కాస్తా మురికి నీటి గుంటగా మారిపోయింది. ప్రస్తుత నగర పంచాయతీ కమిషనర్ డీవీఎస్​ నారాయణరావు చొరవతో... పూర్వవైభవం పొందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దొరువు అభివృద్ధికి నగర పంచాయతీ, 14వ ఆర్థిక సంఘం, ప్రత్యేక నిధుల కోసం రూ.3కోట్లతో ప్రతిపాదనలు పంపగా అనుమతులు మంజూరయ్యాయి. ఈ నిధులు చాలవని అధికారులు చెప్పటంతో మరో రూ.2కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా అనుమతి లభించింది. తొలి విడత రూ.83లక్షలు మంజూరు చేశారు. ఈ నెల 16నుంచి పనులు ప్రారంభించనున్నారు.

చేపట్టనున్న పనులు:

దొరువును పూర్తి స్థాయిలో శుభ్రం చేయించి.. కట్టపై వాకింగ్​ ట్రాక్​, ఉద్యానవనం, చిన్నారులు ఆడుకునేందుకు పార్కు, ఆటస్థలం, సందర్శకులు వేచి ఉండేందుకు గదులు నిర్మిస్తారు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లపై దేవతా మూర్తులు, ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల చిత్రాలు తీర్చిదిద్దటంతో పాటు... బోటు విహారం, మొత్తంగా విద్యుద్దీపాలంకరణ వంటి పనులు చేయనున్నారు. దొరువు పక్కనే ఉన్న వందల ఏళ్ల ఊడల మర్రి చెట్టు వద్ద రెస్టారెంట్​ నిర్మించనున్నారు. వీటితో పాటు కాటమరాజు బురుజు పునర్నిర్మాణం, విజయ మార్తాండేశ్వరుని దేవస్థానం, సొరంగ మార్గం, సింగరప్ప దేవాలయాలను కలుపుతూ ప్రత్యేకంగా వాకింగ్​ ట్రాక్​ ఏర్పాటు చేయనున్నారు. మూడు దశల్లో ఈ పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం.

డిసెంబరు నాటికి పూర్తి...

జీర్ణావస్థకు చేరిన చారిత్రక దొరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నాం. ఈ నెల 16 నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యే మధుసూదన్​ యాదవ్​ ప్రత్యేకంగా దృష్టి సారించి తొలి విడత నిధులు మంజూరు చేయించారు. నవంబరు లేదా డిసెంబరు నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. -డీవీఎస్​ నారాయణరావు, కమిషనర్​, కనిగిరి నగర పంచాయతీ.

ఇదీ చదవండి:తెలంగాణలో జలపాతాలు కళకళ

ABOUT THE AUTHOR

...view details