కనిగిరి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న నక్షత్ర తాబేళ్లను ఎవరైనా పట్టుకొన్నా, అక్రమ రవాణాకు పాల్పడినా... కఠిన చర్యలు తప్పవని స్థానిక అటవీ రేంజ్ అధికారి రామిరెడ్డి తెలిపాడు. ఈ విషయంపై పరిసర గ్రామాల్లో దండోరా వేయించడంతో పాటు గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. అడవి జంతువులను హింసించడం, చంపడం, మాంసం విక్రయించడం, అక్రమ రవాణా చేయడం... నేరమని, అలా చేసినట్లు రుజువైతే వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రేంజ్ పరిధిలో గతంలో ఎర్ర చందనము స్మగ్లర్లు అక్కడక్కడా సంచరించే వారని... ఇన్ఫార్మర్లలను ఏర్పాటు చేసి వారి పై నిఘా ఉంచటం ద్వారా అదుపు చేశామన్నారు. ప్రస్తుతం కనిగిరి రేంజ్ పరిధిలో సిబ్బంది కొరత, ఆయుధాల కొరత కొంత మేర ఉందని తెలిపారు. ఈ సమస్యలను అధిగమిస్తే పూర్తి స్తాయిలో అటవీ విధులు నిర్వహించేందుకు వీలుగా ఉంటుందని వెల్లడించారు.