పది వేలతో కొన్న ఫోన్... మొదటి రోజే పేలిపోతే ఎంత బాధగా ఉంటుంది. లక్ష పెట్టి కొన్న బైక్‌ని మొదటి రోజే ఎవరైనా దొంగిలిస్తే ఎంత కోపం వస్తుంది. డబ్బులు... కొన్న వస్తువు పోయిందనే ఆవేదన ఉంటుంది. ఈ లెక్క ప్రభుత్వ అధికారుల దగ్గరకి వస్తే మాత్రం మారిపోతుంది. ఎంత ప్రజాధనం వృథా అయిన వారికి సూది గుచ్చుకున్నంత బాధ ఉండదు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన పార్కు, కొలనే దీనికి తార్కాణం.
కొలను పాలైన కోటి రూపాయలు
పురపాలక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈత కొలనులు కేవలం రెండు, మూడు చోట్లే ఉన్నవి. కందుకూరులోని కొలను వీటిలో ఒకటి. 2014 సంవత్సరంలో సుమారు 75 లక్షల రూపాయలతో నిర్మించారు. అదనంగా మరో 40 లక్షలు ఖర్చుతో ప్రహరీగోడ, ఇతర హంగులు సమకూర్చి...నిర్వహణ ఓ లీజుదారుడికి ఇచ్చారు. కొన్నాళ్లు పట్టణ ప్రజలతో సందడిగా ఉన్నా... వచ్చిన సొమ్మును సంబంధిత గుత్తేదారు... పురపాలికకు చెల్లించలేదు. పోయింది ప్రజల సొమ్మే కదా అని అధికారులు పట్టించుకోలేదు. ఆర్థిక కారణాలు చూపిన సదరు గుత్తేదారుడు నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఫలితంగా ఈత కొలను ఇలా మూత పడింది.